రామ చక్కని సీతకు
- pnarahariias
- 3 days ago
- 1 min read
రామునికి సీత సీతకు రాముడు. సీతారాముల దాంపత్యం భూమిపైన అత్యంత ఆదర్శప్రాయమైన దాంపత్యం. గోదావరి తెలుగు సినిమాలో సీతారాముల జంటపై కవి ఎంత అద్భుతంగా వర్ణించాడు అంటే.. సీత ఎంతటి చుక్క అంటే రామచక్కని సీత. కేవలం చక్కని చుక్కే కాకుండా రామునితో కూడిన రామచక్కని సీత. దాంపత్యం కేవలం ఒకరి వల్ల కాకుండా ఒకరిలోఒకరు కలుసుకు పోయినప్పుడే దాంపత్యం. సీతారాముల జీవన విధానాన్ని తెలుసుకొని, చదివి తమ జీవితాన్ని నడుపుకుంటే చాలు జీవితం ధన్యం అవుతుంది.
కవి ఇంకొక చోట భార్యా భర్తల సున్నితంమై ఇలా రాస్తారు..
"ఎడమ చేతను శివుని విల్లును ఎత్తినా ఆ రాముడే ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో?"
రాముడు ఆజానుబాహుడు. ఇక్ష్వాకుల వంశడు క్షత్రియుడు, యోధుడు శ్రీరాముడు. అంతటి రాముడు తన ఎడమ చేత సీతా స్వయంవరంలో సీతామతల్లిని గెలవడానికి అత్యంత కష్టమైన శివుని విల్లును, రాజాధిరాజులు ఎత్తలేని అంతటి విల్లును అలవోకగా ఎత్తి సీతను గెలిచాడు. అయితే అంతటి వీరాధివీరుడు అయిన శ్రీరాముడు పెళ్ళిలో సీతమ్మ తల్లితో ఎలా వ్యవహరిస్తాడు అనే విషయంలో కవి ఎంతటి సున్నితం చూపిస్తాడు అంటే-- శ్రీరాముడు బిలిష్టమైన విల్లును అలవోకగా ఎత్తినా తాళి కట్టే వేళలో అంతకు విపరీతంగా సీత జడను ఎత్తి తాళి కట్ట గలడా? రామ చక్కని సీతకి తాళి కడుతూ జడను అత్యంత ప్రేమ ప్రాయంగా వ్యవహరించగలడా? అంటూనే భావి వరులందరికీ సూచిస్తూ భార్యను ఎలా ప్రేమాభిమానాలతో వ్యవహరించాలని కవి చెపుతున్నాడు.
నిత్యజీవితంలో ఎంతటి మనిషి అయినా ఎంతటి బలశాలి అయినా ఎలాంటి ఉన్నత స్థాయిలో ఉన్నా ఎంతటి వ్యక్తిత్వం ఉన్నవాడయినా తన స్త్రీ విషయంలో ఎంత సున్నితంగా ఉండాలని సీతారాముల భార్యభర్తల జీవితం ద్వారా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. భార్యను ఎంత ప్రేమగా చూసుకుంటే అంతా అన్యోన్యత యావత్ కుటుంబంలో కనిపిస్తుంది. భార్యను గౌరవిస్తే కుటుంబంలో సుఖశాంతులు పల్లవిస్తాయి. సీతారాముల ఈ ఆదర్శ దాంపత్యం తరతరాలుగా దంపతులకు దారి చూపిస్తూనే ఉంది.
భావి తరాలకు కూడా రామునికి సీత, సీతకు రాముడు.
శ్రీరస్తు! శుభమస్తు!
-పరికిపండ్ల నరహరి
12th July 2019










Comments