చిరంజీవి లోకకల్యాణార్థం సీతారాముడు కాలేడా!
- pnarahariias
- Dec 19, 2025
- 2 min read
Updated: 3 days ago

"అల్లుడా మజాకా" చిరంజీవి సినిమా చూస్తున్నాను. అందులో చిరంజీవి సీతారాముని పాత్రలో మొట్టమొదటి సీన్లో ఒక ఎస్సైని చంపినందుకు ఉరికంబం ఎక్కబోతూ చివరి కోరిక ఏమిటంటే తన స్వగ్రామమైన సీతాపురంలోని శ్రీరామచంద్రుని దేవాలయ దర్శనం అంటాడు. ఆ మరుసటి సన్నివేశంలో చిరంజీవి పోలీసులతో వచ్చి గ్రామ ప్రజలు అంతా చూస్తుండగా సీతారాములను దర్శించుకున్నాడు. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి.
ఈ సినిమా చూస్తుండగా, ఆగస్ట్ 5న అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు 500 సంవత్సరాల తర్వాత శ్రీరామునికి జన్మనిచ్చిన చోట రామమందిర నిర్మాణం కార్యక్రమం నా స్మరణలోకి వచ్చాయి. ఈ సినిమా మరియు ఆ కార్యక్రమం రెండింటికీ ఏదో లింక్ ఉన్నది అనిపించాయి.
చిరంజీవి తన సినిమాల ద్వారా తెలుగు ప్రజల్లో ఎన్టీ రామారావు తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న గొప్ప నటుడు. ఎన్నో సామాజిక, జానపద, సంగీత పరమైన సినిమాలు రుద్రవీణ, స్వయంకృషి లాంటివే కాకుండా మరెన్నో సమాజాన్ని ఆలోచింపజేసే న్యాయపరమైన చిత్రాలు కూడా తీశారు. ఈమధ్య సైరా నరసింహారెడ్డి లాంటి చారిత్మాత్మక చిత్రాలతో మన మనసులపై మంచి ముద్ర వేశారు.
2009లో ఎన్టీఆర్ తరహాలో కొత్త పార్టీ ప్రజారాజ్యం అని పేరు పెట్టి సుమారు 70 లక్షల ఓట్లు పొందారు. ఇంతటి ఆధార అభిమానాలు వున్న నిలువుటద్దం చిరంజీవి. అతి తక్కువ సమయంలో పార్టీని పెట్టి మూసేశారు. కేవలం ఒక్క ఎలక్షన్ లోనే తను నిరాశ చెంది మళ్ళీ రాజకీయాల్లోకి రాను అని శపథం చేశారు. రాజకీయం ప్రజా శ్రేయస్సు కోసం కాదా! తన సినిమాల ద్వారా ఎన్నో ఓటమి పాఠాలు నేర్పిన చిరంజీవి కేవలం ఒకే ఒక్క ఓటమితో ప్రజలను మరచిపోవడం కరెక్టా?
అయితే ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించిన చిరంజీవి తన శేష జీవితాన్ని ఒక సగం ఆగిన సినిమా లాగ మిగిలిపోతా రా! మనిషి జీవిత లక్ష్యం కేవలం ఒక్క ఓటమితో అయిపోవాల్సిందేనా!
తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం అనే పాటతో ఎందరికో ఆత్మస్థైర్యాన్ని నింపిన చిరంజీవి ప్రజాక్షేత్రంలో ఇక నాకు సెలవు అంటాడా!
ఎంతో పేరు గౌరవమర్యాదలు ఇచ్చిన ఈ సమాజానికి చిరంజీవి మధ్యలో షూటింగ్ ఆపేసిన ఒక సినిమాలగా ఉండిపోతాడా!
వ్యక్తి తాను సంపాదించిన పేరు మర్యాదలు ఆ సమాజం కోసం మళ్ళీ తిరిగి ఇవ్వకపోతే ఆ సంపాదన ఎందుకు? సమాజంలోని మంచి మనుషులు, మనసున్న మనుషులు, ఒక దిశ దిక్కు చూపించ గలిగిన మనుషులు, ముఖ్యంగా సామాజికంగా ఆర్థికంగా ఎంతో వెనుకబడిన, బడుగు బలహీన వర్గాల కోసం తమ సమయాన్ని, సంపాదనను, శక్తి సామర్థ్యాలు ఉపయోగించడం ఎంతైనా అవసరం. అయితే కేవలం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. మరెన్నో మంచి మార్గాలను ఎంచుకొని సమాజానికై పనిచేయవచ్చు.
చిరంజీవి సగంలో ఆగిన ప్రజా సంక్షేమ సినిమానీ పూర్తి చేస్తే జీవితానికి సార్థకత ఉంటుందేమో! లోకకల్యాణార్థం సీతారాముడు అయితే ఇంకా బాగుంటుందేమో!











Comments