'పారడైస్' సినిమా రివ్యూ

కాకతీయ చక్రవర్తిని ఎదురించినందుకు సమ్మక్క సారలమ్మ దేవుళ్లైనారు. మొఘల్ సామ్రాజ్యం మరియు స్థానిక ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప బహుజన యోధుడు, పాలకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వామ్య వ్యవస్థకు, నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ), నిజాం నవాబుల అణచివేతకు వ్యతిరేకంగా అడవి బిడ్డల హక్కుల కోసం పోరాడిన గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు కొమురం భీమ్ కూడా సమాజానికి దేవుళ్లైనారు.
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు..
మహాపురుషులౌతారు...
తరతరాలకి తరగని వెలుగౌతారు..
ఇలవేలుపులౌతారు...
ఈ వ్యవస్థలో తమ హక్కుల కోసం పోరాడి త్యాగాలు చేసినోన్నే ప్రజలు దేవుణ్ణి చేస్తారు. అన్నీ అనుభవించినోణ్ణి దేవుణ్ణి అస్సలే చెయ్యరు.
భారత స్వతంత్రం కోసం ముందుండి నడిపించిండు కాబట్టే గాంధీజీ మహాత్ముడయ్యాడు మరియు జాతిపిత అయినాడు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారతదేశ సామాజిక సమానత్వ శిల్పి, భారత రాజ్యాంగ పితామహుడు. ఒక అణగారిన వర్గంలో పుట్టి, సమాజంలో నెలకొన్న వివక్షను ఎదుర్కొని, దేశంలోనే అత్యున్నత మేధావిగా ఎదిగిన ఆయన జీవిత ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమైనది. జ్యోతిరావు గోవిందరావు ఫూలే (జ్యోతిబా ఫూలే) భారతదేశంలో సామాజిక విప్లవానికి నాంది పలికిన గొప్ప సామాజిక సంస్కర్త, విద్యావేత్త మరియు అణగారిన వర్గాల హక్కుల పోరాట యోధుడు. సమాజంలో కుల వివక్షకు వ్యతిరేకంగా, మహిళా విద్య మరియు సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం देश చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచి ఆయన మహాత్ముడైనాడు.
అదే ఏదైనా పదవి తీసుకొని అన్నీ అనుభవించినోడైతే “జాతిపిత” ఎట్లయ్యేటోడు?
పారడైస్ సినిమాలో సవారీ సామాజిక వర్గ గుర్తింపు కోసం జరిగిన ఉద్యమం ఎన్నో మలుపులు తిరిగి చివరికి విజయం సాధించింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పెరిగిన శ్రీకాంత్ ఓదెల కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అద్భుతం.
ఈ సినిమా స్వాతంత్ర్యం వచ్చిన 80 ఏండ్ల తరువాత ఈ రోజు కూడా ఎన్నో సామాజిక వర్గాలకు దక్కని హక్కులను గురించి గుర్తు చేస్తది.
రైతులకు దక్కని కనీస గిట్టుబాటు ధర, విద్యార్థులకు దక్కని ఫీజుల ఊరట, యువతకు దక్కని ఉపాధి అవకాశాలు, మహిళలకు దక్కని స్వేచ్ఛా స్వావలంబన, దళితులకు దక్కని మందిర ప్రవేశం, గిరిజనులకు దక్కని అటవీ సంపద, బీసీలకు దక్కని రాజ్యాధికారం... అందుకే ఈ సినిమాకు ఈనాటికి ఎంతో ప్రాసంగికత ఉన్నది.
సామాజిక న్యాయం అనేది ఒక గన్ను పట్టుకొని పోరాడేది కాదు, గళం విప్పి అరిచేది కాదు. ఇది ఒక నిరంతర పోరాటం. ఇది కేవలం రాజ్యాధికారం ద్వారా మాత్రమే సాధ్యమైతది. ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకునే సీట్లలో కూర్చుంటామో అప్పుడే సామాజిక న్యాయం సాధ్యమైతది. లేకపోతే సమాజ వర్గాలు, సామాజిక వర్గాలు 'మాలిక్' పెట్టిన భిక్షగా మిగిలిపోతాయి. మన చుట్టూ 'మాలిక్‌లు'
ఉచ్చులు పన్ని కూర్చున్నారు. వాళ్లే రాజులు, వాళ్లే మంత్రులు, వాళ్లే సైనికులు.
అందుకే మన హక్కుల కోసం పోరాడాల్సిందే. "పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప". నీ ప్రయత్నానికి శభాష్ శ్రీకాంత్ ఓదెల!
24th October 2026




Comments