Aa challani samudra garbham
- Nov 14, 2025
- 2 min read
Updated: Nov 25, 2025

అద్భుత సాహిత్యం,
ఆలోచింపచేసే కవిత్వం
మన
దాశరథి కృష్ణమాచార్యులు
'Aa challani samudra garbham' by Dasarathi Krishnamacharyulu
ఆ చల్లని సముద్ర గర్భం -- దాశరథి కృష్ణమాచార్య
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ||ఆ చల్లని||
భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠములెన్నో
కుల మతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో ||ఆ చల్లని||
మానవ కళ్యాణం కోసం పణమెత్తిన రక్తము ఎంతో
రణరక్కసి కరాళ నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో
కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో
భూస్వాముల దౌర్జన్యాలకు
ధనవంతుల దుర్మార్గాలకు
దగ్ధమైన బతుకులు ఎన్నో ||ఆ చల్లని||
అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో
గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ||ఆ చల్లని ||
దాశరధి కృష్ణమాచార్యులు తెలంగాణ మరియు యావత్ తెలుగు ప్రజలందరికీ గొప్ప కవి. ఆయన రాసిన ఎన్నో కవితలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఆ కాలం నాటి సామాజిక ఆర్థిక సమస్యల పట్ల ఆయన రాసిన కవితలు ఈనాటికి మనల్ని ఆలోచింప చేయడానికి కాకుండా సమసమాజ నిర్మాణం కోసం ప్రయత్నం చేసే దిశగా ముందడుగు వేయిస్తుంది.
"ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో" అనే ఈ అద్భుత రచనాత్మక కవిత ద్వారా ఈ మధ్యకాలంలో నన్ను ఎంతో ఆలోచింపజేశాయి.
దాశరధి గారు ఇందులో ఒక చోట రాస్తూ "ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠాలెన్నో" అని రాజుల కాలం నాటి, రాజ్యాల కాలం నాటి, హైందవ, మహమ్మదీయ, క్రైస్తవ, ధార్మిక, బ్రిటిష్ మరియు అనేకానేక కాలలనాటి ఎన్నో యుద్ధాలతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలలో నియంతల పరిపాలనను మనకు స్మరింపజేస్తాయి.
ప్రజల కోసం ఏర్పాటుచేసే వ్యవస్థలో ప్రజల ఓట్లద్వార రాజులవుతున్నారు. ప్రజాస్వామ్యంలో రాజులెందుకు? ప్రజాస్వామ్యంలో కనుమరుగైన దొరతనం, దోపిడీ తనం, భూసామీలు, కుల ఆధిపత్యం మళ్లీ తిరిగి స్టేజి ఎక్కటమెంటి? ఒక నియంతని గెలిపించుటకు నవ ప్రజాస్వామ్యంలో ఎంతోమంది యువకులు తమ ప్రాణాలను అర్పించారు? అరెరే, ఇందుకా ఆ బలిదానలు? ఒక్క సారి ఆ అమర వీరుల తల్లితండ్రులను అడుగుండ్లి, ఇందుకేనా మీ కడుపు తెంచుకు పుట్టిన ఆ కొడుకులు అమరులైనది? ఇందుకేనా?
మరి ఈ ప్రజాస్వామ్యంలో
"అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం,
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో?"
నవ ప్రజాస్వామ్యంలో నియంతలు పుట్టుకొస్తుంటే ప్రజాపాలకులు కాకుండా ప్రజా భక్షకులైతే అన్నార్తులు అనాథలుండని, కరువులు లేని, రైతుల నేత కార్మికుల యువకుల ఆత్మహత్యలు లేని ప్రజా తాంత్రిక వ్యవస్థ ఎప్పుడు పుట్టుకొస్తుంది? ప్రజాస్వామ్య వ్యవస్థ లో కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు, భూ మాఫియాలు, భూ అధిపతులకే రెడ్ కార్పెట్ వేస్తున్న ఈ పర్సెంటేజ్ కమిషన్ తినే నూతన రాజులు మరి ప్రజల గురించి ఎప్పుడు ఆలోచిస్తారు? ఒక్క సారి పాలనలోకి వచ్చి చచ్చేవరకు వాళ్ళే పాలకులు అనే విధంగా తయారవుతున్న ఈ రోజుల్లో ఒరిగిన నర
కంఠాల గురించి ఆలోచించే తీరిక ఎవరికి?
పరికిపండ్ల నరహరి
1st September 2019




Comments